Studio18 News - ANDHRA PRADESH / Kakinada : ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం చినబాబు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని పేర్కొంటూ ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాతాడ నవీన్ రాజ్, కార్యదర్శి ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు తెలిపారు. జర్నలిజం వృత్తిలో పని ఒత్తిడితో పలువురు అకస్మాత్తుగా మరణిస్తున్నారని, దీంతో వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి. సత్యనారాయణ, శ్రీధర్, ఎస్.కే. ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు మరియు మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు, పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News