Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. గుంటూరు, కృష్ణ జిల్లాల్లో రాజధాని పేరిట ఇప్పటికే సుమారు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశారని... మరో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని లేఖలో ఆయన తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల కోసం ఖర్చు చేయడం మంచిదేనని... కానీ మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటానని వారాహి సభలో పవన్ కల్యాణ్ చెప్పారని... ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఏం చేశారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని జోగయ్య పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, పరిశ్రమలు, వ్యవసారం, వ్యాపారం, ఓడరేవులు తదితర అంశాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని ఉభయ గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం ఏయే పథకాలకు ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు ప్రతి ఏడాది ఎంత ఖర్చు చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు సంతోషిస్తారని సూచించారు.
Admin
Studio18 News