Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి నగర పాలక సంస్థలో రూ.3 కోట్ల స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగినట్టు వైసీపీ కార్పొరేటర్లే నిర్ధారించారని వెల్లడించారు. "మనం మామూలుగా ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్ ఇలాంటి చూశాం... కానీ ఇక్కడ స్నాక్స్ స్కామ్ జరిగింది. ఇలాంటి స్కామ్ మొదటిసారి చూస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్ లో అంతా కలిపి 150 మంది ఉంటారు. వారికి అందించే స్నాక్స్ ప్యాకెట్లో ఒక సమోసా, కొన్ని జీడిపప్పులు, కొంత మిక్చర్, ఒక బిస్కెట్ ఉన్నాయి. ఒక చిన్న కప్పులో టీ ఇస్తారు. దీనికి మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ కార్పొరేటర్లే బహిరంగంగా చెప్పారు. ఆ టీలో ఏమైనా బంగారు పూత పూసి ఇచ్చారా...? అన్ని స్కాములు అయిపోయి ఆఖరికి మిక్చర్, సమోసా స్కామ్ కూడా చేశారు. మున్సిపాలిటీ అధికారులేమో రూ.3 కోట్లు కాదు... రూ.38 లక్షలకే తిన్నాం అంటారు, మరో అధికారేమో రూ.1.50 కోట్లకే తిన్నాం అంటారు. స్వయానా వైసీపీ కార్పొరేటర్లే బయటికి వచ్చి రూ.3 కోట్ల స్నాక్స్ అని చెప్పారు" అని వివరించారు. ఇక కార్పొరేషన్ పరిధిలో 90 మంది ఉద్యోగులను నియమించి, వారికి 25 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు రికార్డులు తయారుచేశారని, ఆ నిధులను మళ్లించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. "ఆ ఉద్యోగులందరూ ఎక్కడున్నారో తెలుసా...? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, డీఈలు, ఏఈలు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అధికారుల ఇళ్లల్లో ఇద్దరు చొప్పున పనివాళ్లు ఉన్నారు. వాళ్లతో ఇళ్లలో పనులు చేయించుకుని ప్రభుత్వ డబ్బు జీతాలుగా ఇచ్చారు. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు... ప్రజల డబ్బుతో జల్సాలు చేశారు" అంటూ కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. అంతేకాదు, గతంలో రూ.2 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన డబుల్ డెకర్ బస్సులను కూడా మూలనపడేశారని మండిపడ్డారు.
Admin
Studio18 News