Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ గిరిజన గ్రామంలోని పరిస్థితులు చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు రూ.9.50 కోట్లతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని తెలిపారు. గతంలో తాను పోరాట యాత్రలో భాగంగా పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా మూడు సమస్యలను గుర్తించానని... అవి రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి అని వివరించారు. ఇక్కడికి రావాలని, ఇక్కడ రోడ్లు వేయాలని ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 2020-22 మధ్య వెనుకబడిన జిల్లాల కోసం రూ.670 కోట్లు ఇచ్చింది. ఆ నిధులు వస్తే, గత ప్రభుత్వం హయాంలో లెక్కా పత్రం లేకుండా చేశారు. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బిడ్డ మీ దగ్గర ఓట్లు వేయించుకున్నారు కానీ... గత ఐదేళ్ల పాలనలో మీకు రోడ్డు వేయలేకపోయారు. రుషికొండ ప్యాలెస్ కు రూ.500 కోట్లు ఖర్చు చేశారు కానీ... గిరిజన ప్రాంతం బాగుజోలలో ఒక రోడ్డు వేయలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒకటే అడిగాను... 70 ఏళ్లుగా ఇక్కడ రోడ్లు లేవు, బాలింతలను డోలీల్లో మోసుకెళ్లే పరిస్థితి ఉందని ఆయనకు వివరించాను. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ మాటిస్తున్నాను... మీకోసం ఎండనకా, వాననకా అహర్నిశలు కష్టపడడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read : 'యూఐ' - మూవీ రివ్యూ!
Admin
Studio18 News