Studio18 News - ANDHRA PRADESH / : నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంటు వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. లోక్ సభకు మొదటిసారి ఎన్నికైన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంటుకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పసుపు లాల్చీ ధరించిన అప్పలనాయుడు, పసుపు రంగేసిన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా పంచుకున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు లోక్ సభ ఎన్నికల్లో విజయనగరం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వచ్చి అందరి దృష్టిలో పడ్డారు.
Admin
Studio18 News