Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి ఘటనలో తమపై అక్రమ కేసులు పెట్టారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్లు ఆమె తెలిపారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 సీట్లలో 10 బీఆర్‌ఎస్, నాలుగు సీపీఐ కలిసి మొత్తం 14 స్థానాలు గెలిచామని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాలతో వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. తాను ఆదివాసి ఎమ్మెల్యే అయినప్పటికీ చూడకుండా తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులపై కోవా లక్ష్మి ఆరోపించారు. క్యాతన్‌పల్లి చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో జరిగిన గొడవను పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు మరియు శ్రేణులపై దాడి చేయడానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారని తెలిపారు. దాడి చేయడానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినప్పటికీ పోలీసులు వారిని నిలువరించలేదని ఆమె విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు తాము మూడు కార్లలోనే వచ్చామని మంత్రి మరియు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి మంత్రి 50కి పైగా కార్ల కాన్వాయ్‌తో వచ్చారని కోవా లక్ష్మి అన్నారు. ఇంత పెద్ద కాన్వాయ్‌కు అనుమతి ఎవరు ఇచ్చారు, అంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుతుంటే పోలీసులు ఏం చేశారనే ప్రశ్నలను ఆమె లేవనెత్తారు. గొడవకు సంబంధించి ఏ కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతోందని కోవా లక్ష్మి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కనిపించడం లేదని ఆమె అన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజాస్వామ్యపరంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్, అలాగే ఆయన కుమారుడు ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఈ అరాచకాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా, విప్‌గా పనిచేసిన దళిత యువ, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకుల అరాచకాలను ప్రశ్నించగా బాల్క సుమన్‌తో పాటు 29 మంది ముఖ్య నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు. తక్షణమే ప్రజాస్వామ్యబద్ధంగా క్యాతన్‌పల్లి కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని, అలాగే ఎన్నికల పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోవా లక్ష్మి డిమాండ్ చేశారు.
Admin
Studio18 News