Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy: అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ పారిపోయారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈడీ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ”స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55 వేల కోట్లు. పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15 వేల కోట్లు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. బ్యాంకుల జాతీయకరణతో ఇందిరమ్మ పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారు. సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మది. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ప్రవేశ పెట్టిన మహానేత రాజీవ్ గాంధీ. బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించడంలేదు? హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉంది. ప్రపంచాన్ని దోచుకునేలా ఆ ఇద్దరి వ్యవహార శైలి ఉంది. దుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా. దేశానికి బీజేపీ ముప్పుగా మారింది.. ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. ఆదానీ కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీపై ఎందుకు మాట్లాడటంలేదు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం. జేపీసీపై బీఆర్ఎస్ విధానం స్పష్టం చేయాలి. విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే.. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మీ తాత ముత్తాతలు దిగొచ్చినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏం చేయలేరు. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే.. ఎవడు తొలగిస్తాడో రావాలి.. తారీఖు చెప్పాలి. పదేళ్ల తరువాత ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. కనిపించే తెలంగాణ తల్లి సోనియమ్మ. ఆమె జన్మదినం డిసెంబర్ 9న సచివాలయంలోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మేం తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటాం. రైతు రుణమాఫీపై బీఆరెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దు. ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం.. మీ సమస్యల పరిష్కారం కోసం.. పదేళ్లు మిమ్మల్ని దోచుకు తిన్న ఈ బీఆర్ఎస్ దోపిడీ దొంగలను నమ్మొద్దు. పదేళ్లలో వాళ్లు ఇచ్చింది ఎంత.. 10 నెలల్లో మేం ఇచ్చింది ఎంత అనేదానిపై చర్చకు సిద్ధం. రాజీనామా చేయాల్సి వస్తుందని హరీష్ డ్రామాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39లో 9 కూడా మిగలవ”ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Admin
Studio18 News