Studio18 News - తెలంగాణ / : హైదరాబాదులోని చెరువుల్లో కట్టిన అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 26 ప్రాంతాల్లో 300కు పైగా అక్రమ కట్టాలను హైడ్రా కూల్చివేసింది. అయితే ఇప్పటి వరకు కూల్చినవాటిలో ఆరంతస్తుల భవనమే ఎత్తైనది. త్వరలోనే 20 నుంచి 30 అంతస్తుల అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేయనుంది. వీటిని నేలమట్టం చేయగల సామర్థ్యం ఉన్న అధునాతన యంత్రాలను సమకూర్చుకునేందుకు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు కూడా టెండర్లను ఆహ్వానించింది. వ్యర్థాలను తొలగించడంతో పాటు చెరువుల్లో పూడిక మట్టిని కూడా వెలికి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉన్న నాలుగు చెరువులను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు టెండర్లు పిలిచామని హైడ్రా అధికారులు వెల్లడించారు. మరోవైపు హైడ్రాకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... చెరువులు, ప్రభుత్వ భూముల్లో కొందరు ప్రముఖులు నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. వాటిని గంట నుంచి మూడు గంటల వ్యవధిలోనే కూల్చాల్సి ఉంటుందని... లేకపోతే వారు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చేటప్పుడు కూడా ఇలాంటి సమస్యే వస్తుందని ముందే ఊహించామని... అందుకే ముందు రోజు 3డీ చిత్రంతో ఆన్ లైన్ లో నమూనా కూల్చివేతను చేపట్టామని... మరుసటి రోజున ఉదయం 10 గంటల్లోపు కట్టడాన్ని కూల్చివేశామని తెలిపారు. కూల్చివేతల్లో ఆలస్యం, సమస్యలు ఉండకూడదనే సరైన యంత్రాలను, సంస్థలను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. కూల్చివేతలకు నాలుగు గంటలకు ముందు మాత్రమే కాంట్రాక్టర్ కు పిలుపు వెళ్తుందని తెలిపారు. కాంట్రాక్టు పొందిన సంస్థలు ఓఆర్ఆర్ పరిధిలో ఎక్కడికైనా వారి వాహనాలను తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
Admin
Studio18 News