Studio18 News - తెలంగాణ / : కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కీలకమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో సభకు రాలేదని విమర్శించారు. మోదీ చూస్తే ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ తమ నిర్ణయం చెప్పాలన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చిందే మీ అభిప్రాయమా? అని చురక అంటించారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తాము అయ్యలు, తాతల పేర్లు చెప్పుకొని పైకి రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగామన్నారు. రాహుల్ గాంధీని అంటున్నారా?: కేటీఆర్ చురక తమకు ఈ చర్చకు సంబంధించి తీర్మానం కాపీ అందలేదని కేటీఆర్ అన్నారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తామే చాలన్నారు. సీఎంకు ఓపిక, సహనం ఉండాలని సూచించారు. అయ్యలు, తాతలు అంటూ ముఖ్యమంత్రి అంటున్నారని, అనాలనుకుంటే పేమెంట్ కోటాలో పదవి కొట్టేశారని తాము కూడా అనవచ్చునని చురక అంటించారు. అయ్యల పేర్లు, తాతల పేర్లు చెప్పుకొని వచ్చారని ముఖ్యమంత్రి అంటున్నారని... ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా? అని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశించి.. మీరు మాకు మాత్రమే చెబుతున్నారని... కానీ అధికార పార్టీని వారించడం లేదని అన్నారు. చర్చను సమర్థిస్తున్నాం కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న చర్చను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో మనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ అనే పదం కూడా రాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని... అందుకు అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమేనని కేటీఆర్ అన్నారు. 8+8=0 అంటూ వ్యంగ్యం! సాధారణంగా 8+8=16 అవుతుందని, కానీ ఇక్కడ మనకు జరిగింది మాత్రం గుండు సున్నా అని చురక అంటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లలో గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ పైవిధంగా మాట్లాడారు. నిన్నటి బడ్జెట్ చూశాక తెలంగాణలోని ప్రతి బిడ్డకు మనకు జరిగిన అన్యాయం తెలిసిందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేంద్రంతో సఖ్యతగా లేనందువల్లే మనకు నిధులు రాలేదని గతంలో ముఖ్యమంత్రి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఢిల్లీ తత్వం ఇన్నాళ్లకు బోధపడిందన్నారు. తెలంగాణ హక్కులు ఎవరు కాలరాసినా మెడలు వంచుతామన్నారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడామని... మోదీ ప్రభుత్వంపై పోరాడామని... ఇప్పుడూ పోరాడుతామన్నారు. సభా నాయకుడు ఇష్టారీతిన విమర్శలు చేయడం సరికాదన్నారు.
Admin
Studio18 News