Studio18 News - TELANGANA / NIRMAL : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య రక్షణకు కీలకమైన HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి మహిళలను రక్షించేందుకు HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. చిన్న వయస్సు బాలికలకు ఈ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ప్రజలు అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లలకు ఈ టీకాను వేయించుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణలో మరో కీలక అడుగుగా నిలిచింది. “మహిళల ఆరోగ్యం బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది” అని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
Admin
Studio18 News