Studio18 News - తెలంగాణ / : ఆస్ట్రేలియాతో లార్డ్స్‌లో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ చెలరేగిపోయాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ నమోదు చేసి రికార్డులకెక్కాడు. కేవలం 25 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 27 బంతులు ఆడి 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 229.63. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ చివరి ఓవర్‌లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. కాగా, వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. లివింగ్ స్టోన్ దెబ్బకు ఇంగ్లండ్ పలు రికార్డులు నమోదు చేసింది. 2004లో వెస్టిండీస్‌పై ఫ్లింటాప్ సాధించిన అత్యధిక సిక్సర్ల రికార్డును లివింగ్‌స్టోన్ సమం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఫ్లింటాప్ 129 బంతుల్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లతో 123 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 12 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక (312) స్కోరు. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును స్టార్క్ మూటగట్టుకున్నాడు.
Admin
Studio18 News