Studio18 News - TELANGANA / : High Court Chief Justice : తెలంగాణ రాష్ట్రంలో వైరల్ జ్వరాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. లేఖను పిల్ గా స్వీకరించి విచారించాలని కోరారు. ప్రజలు జీవించే హక్కును పరిరక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని లేఖలో హైకోర్టు న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. ఎనిమిది నెలల్లో పది జిల్లాలను ప్రభుత్వం హైరిస్క్ గా ప్రకటించింది. లక్షలాది మంది డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్లో 1697 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. నెలనెలకు విష జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. దోమలు, జ్వరాల నివారణలో మున్సిపల్, వైద్యశాఖ విఫలమైందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలులేక వేలాది మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగ నివారణ చర్యలు, వైద్యసదుపాయాలు, మౌలిక వసతులు, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టు సీజేకు రాసిన లేఖలో చిక్కుడు ప్రభాకర్ కోరారు. ప్రజలు జీవించే హక్కును పరిరక్షించడం కోసం కోర్టులు కలుగజేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
Admin
Studio18 News