Studio18 News - తెలంగాణ / : వరదలు, భూకంపాల ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ లో ఇకపై సెల్లార్ నిర్మాణాలను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్ కోసం కొన్ని భవనాలలో సెల్లార్ ను రెండు నుంచి ఐదు అంతస్తుల వరకూ నిర్మిస్తుంటారు. హైదరాబాద్ లోనూ పలు కమర్షియల్ బిల్డింగ్స్ లలో ఈ తరహా సెల్లార్ లను చూడొచ్చు. అయితే, దీనివల్ల వరదలు వచ్చినపుడు సెల్లార్ లలోకి వరద నీరు చేరి అనేక ఇబ్బందులకు కారణమవుతోంది. సెల్లార్ల నిర్మాణానికి లోతుగా తవ్వాల్సి రావడం, తవ్వి తీసిన మట్టి కూడా సమస్యగా మారింది. వీటన్నింటి వల్ల భవన నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు, సిటీలోని పలు ఏరియాలను భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆయాచోట్ల నిర్మించే భవనాల్లో సెల్లార్ లు కూడా కట్టడం ప్రమాదకరమని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్లార్ల నిర్మాణానికి అనుమతించక పోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా నిబంధనలను మార్చేయాలని యోచిస్తోంది. సాధారణంగా సెల్లార్లను పార్కింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. సెల్లార్లు లేకుంటే పార్కింగ్ సమస్య ఎదురవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్టిల్ట్ నిర్మాణాల (భూమి పై నుంచే పార్కింగ్ కోసం పలు అంతస్తులు వదిలి వేయడం) కు ఎన్ని అంతస్తులకైనా పర్మిషన్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల అనుమతించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠంగా 3 స్టిల్టుల వరకు అనుమతిస్తున్నామని చెప్పారు. నివాస సముదాయాల నిర్మాణంలో ఈ విధానాన్ని బిల్డర్లు స్వాగతించినా.. కమర్షియల్ బిల్డింగ్ ల నిర్మాణంలో పెద్దగా ఆసక్తి చూపడంలేదని వివరించారు. కమర్షియల్ బిల్డింగ్ లలో గ్రౌండ్ ఫ్లోర్ కు డిమాండ్ చాలా ఎక్కువ అని, అలాంటిది గ్రౌండ్ ఫ్లోర్ ను పార్కింగ్ కు వదిలివేస్తే నష్టపోవాల్సి వస్తుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విధానంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Admin
Studio18 News