Studio18 News - తెలంగాణ / : ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె తన మొబైల్ ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేయడం నేరం కాబోదని జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు సందర్భంగా సీబీఐ, ఈడీ తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు పలు ఆరోపణలు చేశారు. కవిత తన మొబైల్ ఫోన్లలోని మెసేజ్‌లను డిలీట్ చేయడంతోపాటు వాటిని ఆమె ఫార్మాట్ చేసి సాక్ష్యాలను చెరిపివేశారని ఆరోపించారు. స్పందించిన ధర్మాసనం ఫోన్‌లోని మెసేజ్‌లను ఎప్పటికప్పుడు చెరిపివేస్తూ ఉంటారని, దీనిని బలపరిచే ఇతర సాక్ష్యాలు లేనట్టయితే ఇది నేరపూరిత చర్య కాబోదని తేల్చి చెప్పింది. దర్యాప్తు సంస్థల వాదనను కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలు ఇప్పుడు తమ ఫోన్లను ఆటవస్తువుల్లా ఉపయోగిస్తున్నారని, ఫోన్‌ను అప్‌డేట్ చేసేందుకే తన క్లయింట్ ఫార్మాట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఆయన వాదనతో అంగీకరించిన సుప్రీం ధర్మాసనం మెసేజ్‌లను డిలీట్ చేయడం, ఫార్మాట్ చేయడం నేరం కాబోదని పేర్కొంది. ఫోన్ అనేది ప్రైవేటు విషయమని, అందులో ఇతర విషయాలు కూడా ఉంటాయని జస్టిస్ విశ్వనాథన్ తెలిపారు. గ్రూపుల నుంచి వచ్చే మెసేజ్‌లతో ఫోన్ నిండిపోతుందని, కాబట్టి వచ్చిన మెసేజ్‌లను వచ్చినట్టు డిలీట్ చేయడం తనకు అలవాటని వివరించారు.
Admin
Studio18 News