Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పంజాగుట్టలోని సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది. కారు షెడ్డుపై పిడుగుపడడంతో లోపల పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్లపై వరద భారీగా ప్రవహిస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుడిని రాంనగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు. మలక్ పేట అజాంపుర, డబీర్ పురా వద్ద వరద కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాంనగర్ లో స్కూటీపై వెళుతున్న వ్యక్తి వరదనీటిలో పడిపోయాడు. వరదనీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చెరువులను తలపిస్తున్న సిటీ రోడ్లు.. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో మోకాలిలోతు వరకు నీరు చేరింది. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.
Admin
Studio18 News