Studio18 News - TELANGANA / NIZAMABAD : ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నామని ధర్పల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఐదుగురు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. హెచ్‌పీవీ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని, ఇది పునరుత్పత్తి మార్గంలో కలిగే సాధారణ సంక్రమణగా గుర్తించబడిందని వివరించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఈ హెచ్‌పీవీ వైరస్ అని చెప్పారు. ఇది కొత్త వ్యాక్సిన్ కాదని, 2006 సంవత్సరం నుంచే ఈ టీకాను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సిన్ గార్డసిల్–4 చాలా ఖరీదైనదిగా, సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల విలువ ఉంటుందని, అయితే ప్రభుత్వం అర్హులైన 14 సంవత్సరాల బాలికలకు దీనిని ఉచితంగా అందిస్తోందని చెప్పారు. సంతానం కలగదని, గర్భస్రావాలు అవుతాయని, పుట్టుకలో లోపాలు వస్తాయని వంటి అపోహలకు ప్రజలు గురికావద్దని, ఇది పూర్తిగా సురక్షితమైన టీకా అని స్పష్టం చేశారు. 2011 మార్చి 7 నుంచి 2012 మార్చి 8 మధ్య జన్మించిన 14 సంవత్సరాల బాలికలందరికీ ఈ టీకాను ఇవ్వించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి, సూపర్వైజర్ భూలక్ష్మి, ఓపీ ఏఎన్ఎం మీనా, సుమలత, శ్రీనివాస్, పద్మ, మురళి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ప్రసాద్.
Admin
Studio18 News