Studio18 News - TELANGANA / : బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీశ్ రెడ్డిని శాసన సభ నుండి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి అగౌరవంగా ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఆయన అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడలేదని, అయినా సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆయన చేసిన తప్పేమిటో వివరణ ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావగా జరిగేందుకు సహకరించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఇదే విషయాన్ని సభాపతికి, మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టంగా చెప్పామని ఆయన తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాలని తాము కోరినప్పటికీ, తమ మాటలు పట్టించుకోలేదని అన్నారు. సభను ఐదు గంటల పాటు వాయిదా వేసి, ఆ తర్వాత నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడించి, సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఇది ఏకపక్ష నిర్ణయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.
Admin
Studio18 News