Studio18 News - తెలంగాణ / : తనకు ప్రధాని నరేంద్రమోదీ నుంచి, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, దీంతో తాను తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు తెలిసిందని రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఆయన త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. రాష్ట్ర గవర్నర్‌గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అగర్తాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... త్రిపుర నుంచి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తిని తానే నన్నారు. తనకు శనివారం రాత్రి ప్రధాని మోదీ ఫోన్ చేశారని తెలిపారు. ఆయన ఫోన్ చేసే వరకు తన నియామకం గురించి తెలియదన్నారు. 'మీరు త్రిపుర వెలుపల పని చేయాల్సి ఉంటుంది' అని తనకు ఫోన్ చేసి ప్రధాని చెప్పారని వెల్లడించారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సిద్ధమేనని తాను మోదీకి తెలిపానన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆయన స్వాగతం పలుకుతూ ఫోన్ చేశారని తెలిపారు. దీంతో తాను తెలంగాణకు గవర్నర్‌గా వెళుతున్నట్లుగా అర్థమైందన్నారు. గతంలో తాను త్రిపుర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తానన్నారు. త్రిపురపై ప్రధాని మోదీకి శ్రద్ధ ఉందని, ఇందుకు తన నియామకమే నిదర్శనమన్నారు. తాను త్రిపుర ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా పని చేసినప్పుడు మోదీ సహకారం అందించారన్నారు. ఈ నెల 31న తెలంగాణకు వెళ్లి అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.
Admin
Studio18 News