Studio18 News - తెలంగాణ / : Hydra : హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా.. తగ్గేదేలే అన్న రీతిలో దూకుసుపోతోంది. చెరువుల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెరువులను కబ్జా చేసి కట్టిన కట్టడాలను నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక, తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల భరతం పట్టనుంది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులకు అంతా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. వారిపై కేసులు పెట్టాలని ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫార్సు చేసింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఓ డిప్యూటీ కమిషనర్ పై కేసు నమోదు చేయాలని హైడ్రా సిఫార్సు చేసింది. హెచ్ఎండీఏ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిపై కేసు పెట్టాలని సిఫార్సు చేసింది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లపై కేసు నమోదు చేయాలని సూచించింది. ఇప్పటికే గండిపేట సూపరింటెండెంట్ ఇంజినీర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫార్సు చేసింది. అంతేకాదు త్వరలో ఇతర ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News