Studio18 News - తెలంగాణ / : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నీటిని కిందికి వదిలేందుకు అధికారులు ప్రయత్నించారు. గేట్లు ఎత్తుతుండగా నీటి ఒత్తిడి కారణంగా 2, 3 నెంబర్ గేట్ల ప్యానెల్ లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ కాయిల్స్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎగువన జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3.26 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు నుంచి 3.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్ కు వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 214.8870 టీఎంసీలకు చేరిందని, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అని పేర్కొన్నారు.
Admin
Studio18 News