Studio18 News - తెలంగాణ / : తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిపై వివాదం నెలకొన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రాష్ట్రంలోని దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యిని ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇకపై టెండర్లు పక్కనపెట్టి నేరుగా విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తి చేసే నెయ్యిని కాకుండా కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థలవైపు చూడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుకొచ్చిన ఆలయాలు రాష్ట్రంలో కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలు 12 ఉండగా, రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 24 ఉన్నాయి. మరో 325 ఆలయాల్లో రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల ఆదాయం వస్తోంది. వీటిలో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచి సంస్థలను ఖరారు చేస్తున్నారు. చిన్నచిన్న దేవాలయాల్లో మాత్రం టెండర్లు లేకుండా నేరుగా నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో విజయ నెయ్యిని కొనుగోలు చేసేందుకు వేములవాడ, వరంగల్ భద్రకాళి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, మంచిర్యాల వేంకటేశ్వరస్వామి దేవాలయం పెద్ద ఎత్తున విజయ నెయ్యిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. పేరుకుపోతున్న నిల్వలు మరోవైపు, విజయ డెయిరీ వద్ద ప్రస్తుతం 50 టన్నులకు పైగా నెయ్యి పేరుకుపోయింది. గతంలో ముంబై సంస్థలు విజయ నుంచి నెయ్యిని కొనుగోలు చేసేవి. ఇప్పుడవి ముఖం చాటేయడంతో నెయ్యి నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటే పాడైపోయే అవకాశం ఉండడంతో తమ నెయ్యిని కొనుగోలు చేయాలని డెయిరీ ఎండీ లక్ష్మి మార్చి 15, జూన్ 1న దేవాదాయశాఖతోపాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు లేఖ రాశారు. అయినప్పటికీ వాటి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి కమీషన్లే కారణమని గుర్తించిన ప్రభుత్వం ఇకపై దేవాలయాలన్నీ టెండర్లతో పనిలేకుండా విజయ నెయ్యిని కొనుగోలు చేయాలని ఆదేశించింది.
Admin
Studio18 News