Studio18 News - తెలంగాణ / : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా అందడం లేదని దుయ్యబట్టారు. పౌష్టికాహారంతో విద్యార్థుల కడుపులు నింపాల్సింది పోయింది... గొడ్డుకారం, నూనె మెతుకులు తినాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గొడ్డుకారంతో భోజనం పెట్టారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పిల్లలందరికీ గొడ్డు కారం, నూనె పోసి భోజనం పెట్టారని కేటీఆర్ తన ట్వీట్ లో వెల్లడించారు. ఇష్టం లేకపోయినప్పటికీ ఆ గొడ్డు కారంతో కూడిన అన్నం తిని పిల్లలు కడుపు నింపుకున్నారని తెలిపారు. మన బడి పిల్లలకు అందాల్సిన ఆహారం ఇదేనా...? అని తెలంగాణ సీఎంఓను కేటీఆర్ ప్రశ్నించారు. పాఠశాల విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాఠాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీంను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండానే రద్దు చేసిందన్నారు. ఇప్పుడు పిల్లలకు సరైన భోజనం దొరకడం లేదన్న వార్తలను చూస్తుంటే మాటలు రావడం లేదన్నారు. పాఠశాలల్లో పెడుతున్న భోజనంపై వీలైనంత త్వరగా సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ అభ్యర్థించారు.
Admin
Studio18 News