Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో భారీ వర్షాలకు ఇల్లు వాకిలి కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారిని ఆదుకోవడానికి ఉద్యోగుల జేఏసీ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వనున్నట్లు ఉద్యోగుల తరఫున ప్రకటించింది. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సీఎం సహాయనిధికి రూ.100 కోట్లు అందజేస్తామని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మీడియాకు తెలిపారు. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో ఉద్యోగులు కూడా పాలుపంచుకుంటున్నారని చెప్పారు. ఇందులో అన్ని ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, ఈ విపత్తు నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వానికి తమవంతుగా అండగా నిలవాలని, వరద బాధితులకు సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని వి.లచ్చిరెడ్డి వివరించారు.
Admin
Studio18 News