Studio18 News - తెలంగాణ / : 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కించుకున్న 'బలగం' చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నా సోదరుడు వేణు యెల్దండకు అభినందనలు. బలగం సినిమాలో అద్భుత నటనకు, అద్భుతమైన పనితీరుకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు దక్కించుకున్నారు' అని పేర్కొన్నారు. ఈ అవార్డులకు, ప్రశంసలకు మీరు, మీ సినిమా బృందం అర్హులు అని పేర్కొన్నారు. మున్ముందు మరెన్నో విజయాలకు ఇది తొలిమెట్టు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. బలగం సినిమాకు గాను వేణు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులను అందుకున్నాడు. దసరా సినిమాలో నటనకు గాను నాని, కీర్తి సురేశ్‌లు 'ఉత్తమ నటీనటులు'గా ఎంపికయ్యారు. 'ఉత్తమ పరిచయ దర్శకుడి' అవార్డులను శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) దక్కించుకున్నారు. బేబీ చిత్రానికి కూడా పలు విభాగాల్లో అవార్డులు లభించాయి.
Admin
Studio18 News