Studio18 News - తెలంగాణ / : TG Cabinet expansion : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. పార్టీకి కొత్త సారధి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అధిష్టానం అనుమతికోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. మొన్నటి వరకు జోడు పదవులతో బిజీబిజీగా ఉన్న రేవంత్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ గా మహేశ్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ బాధ్యతల నుంచి రేవంత్ ఫ్రీ అయ్యారు. ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. కేబినెట్ విస్తరణకు సామాజిక కూర్పులో భాగంగా పీసీసీ చీఫ్ ఎవరు అవుతారన్నది ముడిపడి ఉండటంతో తర్జనభర్జన తరువాత బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్ కు హైకమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 11మందితో కేబినెట్ ఉంది. కొత్తగా కేబినెట్ లో చేరేందుకు మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా మంత్రిగా చోటుదక్కించుకోవాలని ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కులాలు, జిల్లాలు, బలాలు ఇలా ఎవరికివారు లెక్కలు వేసుకొని రేవంత్ కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో హైదరాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరూ లేరు. ఈసారి ఈ జిల్లాల నేతలకు చాన్స్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉండగా ఒక్కరికే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు, వెడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డికి దాదాపుగా బెర్త్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తుండగా.. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అధిష్టానం కటాక్షం దక్కుతుందోనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.
Admin
Studio18 News