Studio18 News - తెలంగాణ / : ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సంస్థ కబ్జాదారులను వణికిస్తోంది. నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఆక్రమణలను తొలగించడం చేస్తోంది. దీంతో దీనిపై కొంతమంది ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రాను ఉద్దేశిస్తూ తాజాగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న హైడ్రాను రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దని బీఆర్ఎస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హితవు పలికింది. 'డియర్ హైడ్రా! కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చెందిన ఈ అక్రమ రిసార్ట్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు? రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి! మొదట కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలను కూల్చండి' అని బీఆర్ఎస్ తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు ఒక వీడియోను కూడా జత చేసింది.
Admin
Studio18 News