Studio18 News - తెలంగాణ / : నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, మంత్రులు, ఉన్నతాధికారులను కలవాలని, మీ రేవంతన్నగా మీ కోసం నేను అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందన్నారు. నిరుద్యోగులు పదేళ్లు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. బడ్జెట్‌లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆలోచనలు వినడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకున్న వారందరికీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ క్షణంలో మీ తల్లిదండ్రుల గుండె ఉప్పొంగుతుందన్నారు. అగ్నిమాపక శాఖ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదని... విపత్తును జయించే సామాజిక బాధ్యత అన్నారు. గ్రామాల్లో యువత తల్లిదండ్రులను సరిగ్గా చూడటం లేదని తన దృష్టికి వస్తోందని, దయచేసి మీకు రెక్కలు వచ్చాక కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లవద్దని కోరుతున్నానని సూచించారు.
Admin
Studio18 News