Studio18 News - తెలంగాణ / : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌పై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5న విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబరు 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న కోర్టు కొట్టివేయగా.. ఆయన ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది.
Admin
Studio18 News