Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి, ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనం (హెరిటేజ్ బిల్డింగ్)గా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు నిన్న శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నిజానికి ప్రస్తుతం ఆసుపత్రి కొనసాగుతున్న భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావించారు. అయితే, ఇది కాస్తా కోర్టుకు చేరడంతో దానిని అలానే ఉంచి గోషామహల్ పోలీస్ క్వార్టర్స్‌లోని 30 ఎకరాల స్థలంలో ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా 26 ఎకరాల స్థలంలో ఉన్న ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని ప్రకటించారు. వారసత్వ భవనాల కూల్చివేత సరికాదంటూ చరిత్రకారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.
Admin
Studio18 News