Studio18 News - తెలంగాణ / : ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు శనివారం కూల్చేశారు. చెరువు స్థలం ఆక్రమించి కట్టారని తేలడంతో హైడ్రా ఈ కూల్చివేత చేపట్టింది. ఈ సందర్భంగా ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016 లో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని అసెంబ్లీలో ప్రస్తావించారు. చెరువును అడ్డంగా ఆక్రమించి కట్టారని ఆరోపించారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన హీరోలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాంటి నిర్మాణం చేపట్టిన హీరో నాగార్జునపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని సభలో ప్రశ్నించారు. నాగార్జునపై చర్యలు తీసుకోకుండా ఏ శక్తి ప్రభుత్వాన్ని అడ్డుకుంటోందని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయినప్పటికీ గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై గతంలో తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు. నేడు ఆ కట్టడాన్ని కూల్చివేయించారు. దీంతో రేవంత్ రెడ్డిపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘నాడు - నేడు మా రేవంతన్నది ఒకే మాట. దమ్మున్న లీడర్ రేవంతన్న’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Admin
Studio18 News