Studio18 News - తెలంగాణ / : 'తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నాను. మోదీకి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. అమరవీరులనూ కించపరిచార'ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా... కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. తెలంగాణ అంటే ప్రధాని మోదీకి మొదటి నుంచీ చిన్నచూపు అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ ఎన్నోసార్లు అవమానించారన్నారు. తెలంగాణను మోదీ అవమానిస్తే ఈరోజు వరకు బీజేపీ నేతలు మాట్లాడలేదన్నారు. సుష్మాస్వరాజ్‌ను చిన్నమ్మ అంటాం సుష్మాస్వరాజ్ లేకుంటే బీజేపీ ఎప్పుడో తెలంగాణ పుట్టి ముంచేవారన్నారు. అందుకే సోనియాగాంధీతో పాటు సుష్మాను తాము చిన్నమ్మ అని పిలుచుకుంటామని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్‌ను మేం చిన్నమ్మ అంటుంటే... మీరేమో తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు, హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. వంద సీట్లలో డిపాజిట్ రాని బీజేపీ నేతలు కూడా ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బడ్జెట్‌పై జరిగిన అన్యాయం గురించి తెలంగాణ బీజేపీ నేతలు స్పందించరా? అని నిలదీశారు. సిరిసిల్లకు టెక్స్ టైల్ పార్క్ అడగడం తప్పా? అన్నారు. ఆత్మహత్యలు జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి, బీహార్ రాష్ట్రాలు తప్ప ఎక్కడా బడ్జెట్‌లో తెలంగాణ పేరును ప్రస్తావించలేదన్నారు. తన కుర్చీని కాపాడుకోవడానికే మోదీ ఏపీకి, బీహార్‌కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారన్నారు. సబ్ కా సాత్... సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అని నిలదీశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భారత్‌లో భాగం కాదా? అని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై తాము కచ్చితంగా అడుగుతామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు గుజరాత్ వెళతారో... ఢిల్లీకి వెళతారో... ఏపీకి వెళతారో కానీ నిధులు రావాలన్నారు. ఏయ్ అంటే ఊరుకోను: హరీశ్ బాబుపై పొన్నం ఆగ్రహం పొన్నం మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏయ్ ఏంది... ఏయ్ అంటే ఊరుకోను. నేను బలహీనవర్గాల బిడ్డనని దొర అహంకారం చూపిస్తే బాగుండదు... హరీశ్ బాబు అలా మాట్లాడటం సరికాదు' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Admin
Studio18 News