Studio18 News - తెలంగాణ / : హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలోని ఇతర నాయకులు హైడ్రాపై ఆచితూచి మాట్లాడుతుంటే రఘునందన్ మాత్రం అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సమర్థించిన ఆయన.. ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వం తరపున హైకోర్టులోనూ వాదనలు వినిపించేందుకు సిద్ధమని ప్రకటించి సంచలనమే సృష్టించారు. తాజాగా, మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అడ్డొచ్చే వారిపై బుల్డోజర్లు ఎక్కించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెరువులు, కుంటలు, ఆక్రమణల కూల్చివేతల విషయంలో ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, ఈ విషయంలో హైడ్రా పారద్శకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగని పేదల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధుల్లో రాజకీయ నాయకులు ఎవరూ కలగజేసుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి ప్రభుత్వ భవనాలైనా సరే కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
Admin
Studio18 News