Studio18 News - తెలంగాణ / : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫాంహౌస్ పై హైడ్రా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఫాంహౌస్ నిర్మాణంలో నిబంధనలను ఖాతరు చేయలేదంటూ మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కల్పించుకుంది. ఫాంహౌస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది తేల్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు జన్వాడ ఫాంహౌస్ కొలతలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ తరఫున సర్వేయర్, ఇరిగేషన్ శాఖ తరఫున ఇంజినీర్, మరికొందరు సిబ్బంది అక్కడి భవనం, చుట్టూ ఉన్న ప్రహరీ, చెరువు ఎఫ్‌టీఎల్ మార్కింగ్, బఫర్ జోన్ ఎంత వరకు విస్తరించి ఉందన్న దానిపై వివరాలను సేకరించారు. గ్రామ సర్పంచ్ గతంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్రామ నక్ష ప్రకారం మొత్తం వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. తమ పరిశీలనలో గుర్తించిన విషయాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ఫాంహౌస్ నిర్మాణంలో శంకర్ పల్లి నాలా ఆక్రమణకు గురైందని, ఈ నిర్మాణం జీవో 111 పరిధిలోకి వస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు క్షేత్ర స్థాయిలో కొలతలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఫాంహౌస్ కూల్చివేత తప్పదని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఫాంహౌస్ కేటీఆర్ దేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా.. తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నానని కేటీఆర్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని అన్నారు.
Admin
Studio18 News