Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విషయమే మరిచిపోయారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో ఆయన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంటోందన్నారు. ఆ పార్టీకి ప్రజలందరూ స్వస్తీ చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా అవినీతి జరుగుతోందన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. గతంలో ప్రజల తీర్పును కాలరాసి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో కేవలం జెండా మాత్రమే మారిందని, ప్రజావాణి వినిపించడంలో బీజేపీ కృషి చేస్తుందన్నారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2లో 783 పోస్టులను 2000కు పెంచాలన్నారు. 1365 గ్రూప్ 3 పోస్టులను 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇవ్వాలన్నారు.
Admin
Studio18 News