Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఉదయం 11గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు సోనియాగాంధీతో భేటీ అవుతారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోనూ వారు భేటీ కానున్నారు. ఈ భేటీలో నూతన పీసీసీ ఎంపిక, క్యాబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించనున్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్యఅతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణాలు మాఫీ చేసినందుకుగాను వరంగల్ లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించుకున్న తరువాతనే తెలంగాణలో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకం. నామినేటెడ్ పోస్టుల భర్తీలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. పీసీసీగా కొత్తవారికి అవకాశం.. మంత్రివర్గంలోకి మరి కొంతమందికి చోటుపై ముఖ్యనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తుండటంతో పార్టీ వ్యవహారాలు పూర్తిస్థాయిలో చూసుకునేందుకు పీసీసీ చీఫ్‌ను నియమించాలని చూస్తోంది హైకమాండ్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు.
Admin
Studio18 News