Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాంహౌస్‌ను లీజుకు తీసుకొని కొత్త చరిత్రకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చెరువులకు నీళ్ళు అందించే ఫిరంగి నాళా క్యాచ్‌మెంట్ ఏరియాను మూసేసి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించారు. ఈ పామ్ హౌస్‌ను ఎందుకు కూల్చకూడదో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మనం సాధారణంగా ఇళ్లు, విల్లాలను అద్దెకు తీసుకుంటామని, కేటీఆర్ మాత్రం ఫామ్ హౌజ్‌ను తీసుకున్నారని వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడని ఆరోపించారు. ఈ కట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనాడే ప్రశ్నించారని, అందుకే ఆయనను అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో ఉంచారన్నారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ ఆ రోజు చెప్పారని, ఈ రోజు కూడా అదే చెబుతున్నారన్నారు. కానీ పోలీస్ శాఖ మాత్రం అది కేటీఆర్‌దేనని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిపారు. ఎఫ్‌టీఎల్ జోన్‌లో కేటీఆర్‌కు చెందిన చాలా భూములు ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్రాలను మీడియాకు ఇస్తామన్నారు. దాదాపు లక్ష చదరపు అడుగుల స్థలంలో ఫామ్ హౌజ్ నిర్మాణం జరిగిందన్నారు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారన్నారు. ఆక్రమణలను బయటకు తీసుకువచ్చి చర్యలు తీసుకుంటున్న తరుణంలో కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదా జీవో 111 పరిధిలో తనకు, తన కుటుంబ సభ్యులకు భూములు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చాలా సర్వే నెంబర్లలో కేటీఆర్‌కు సంబంధించిన భూములు ఉన్నాయన్నారు. కల్వకుంట్ల శైలిమ పేరుపై ఎఫ్‌టీఎల్ జోన్‌లో భూములు ఉన్నాయని చెబుతూ మీడియా ముందు చదివి వినిపించారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రభుత్వ భూములను యథేచ్చగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో సీఎం నుంచి కార్పోరేటర్ వరకు భూములను ఆక్రమించుకున్నారన్నారు. నిజాం కాలం నుంచి ప్రభుత్వ అవసరాల కోసం ఉంచుకున్న కొన్ని లక్షల ఎకరాల భూముల మీద కన్నుపడి ఉద్యమం పేరుతో ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భూఆక్రమణలకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరాలు బయటపెడుతున్నట్లు చెప్పారు.
Admin
Studio18 News