Studio18 News - తెలంగాణ / : Women Commission Office : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, మహిళా నేతలు కూడా తరలివచ్చారు. అయితే, కేటీఆర్ ఒక్కరికే కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, మహిళా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్దకు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ మహిళా నేతలు చేరుకున్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలకు పోటీగా కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో మహిళలు ఆందోళనకు దిగారు. క్షమాపణలు చెప్పేవరకు వదిలిపెట్టబోమంటూ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. గతనెల 15వ తేదీన తెలంగాణ భవన్ లో జరిగిన స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాటలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో.. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళల పట్ల కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు నోటీసులు పంపించింది. కేటీఆర్ అప్పటికే తన వ్యాఖ్యల పట్ల మహిళలు బాధపడిఉంటే క్షమాపణలు చెబుతున్నానని ట్విటర్ లో క్షమాపణలు చెప్పారు.
Admin
Studio18 News