Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను తొలగిస్తూ ప్రజల మెప్పు పొందిన ‘హైడ్రా’ ప్రస్తుతం కూల్చివేతలను ఆపింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను గుర్తించినప్పటికీ వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునగడం, సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తుండడంతో తమ పనిని ఆపేశామని చెప్పారు. తమ బృందాలు జీహెచ్ఎంసీ మాన్ సూన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాకే ఆక్రమణల తొలగింపు మొదలుపెడతామని వివరించారు. వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో రంగనాథ్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటల పక్కనే ఉన్న కాలనీలలో పర్యటిస్తూ, స్థానికులను అడిగి అక్కడి పరిస్థితికి కారణాన్ని తెలుసుకుంటున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలోని అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని అందులో హెచ్చరిస్తున్నారు.
Admin
Studio18 News