Studio18 News - తెలంగాణ / : విద్యారంగంలోని సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. విద్యను బలోపేతం చేయడానికి విద్యావేత్తలు, మంత్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తద్వారా పేదవారిని విద్యకు దూరం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. స్కూళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని హితవు పలికారు. గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర: కొప్పుల ఈశ్వర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో 34 మంది విద్యార్థులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమాకులలో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కిన పరిస్థితులు చూశామన్నారు. ఇలాంటి ఘటనలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో నాణ్యమైన తిండి పెట్టడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల పట్ల చిన్నచూపుకు ఇది నిదర్శనమని మండిపడ్డారు.
Admin
Studio18 News