Studio18 News - తెలంగాణ / : విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపడం, రికార్డుల్లో అవకతవకలు చేయడం సహా తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. తెల్లవారుజామునే హాస్టళ్లకు చేరుకుని విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరీక్షించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లో అధికారులు దాడులు చేస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఎంతమంది.. రికార్డులో ఎంతమంది ఉన్నట్లు చూపిస్తున్నారనే లెక్కలు సరిచూస్తున్నారు. వారికి పెడుతున్న ఆహారాన్ని స్వయంగా పరీక్షించి చూశారు. మంగళవారం సాయంత్రం వరకూ ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, వివిధ సదుపాయాలకు హాస్టల్ నిర్వాహకులు గండికొడుతున్నారని, తప్పుడు బిల్లులతో కాజేస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
Admin
Studio18 News