Studio18 News - తెలంగాణ / : ఎనిమిదేళ్ల పాటు సాగిన నిర్మాణ పనులు పూర్తయి బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.. మంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభం కూడా చేశారు. ఎలాగైతేనేం మన కష్టాలు తీరాయని జనం అనుకునేలోపే సదరు బ్రిడ్జి కుంగిపోవడం మొదలుపెట్టింది. వాహనంతో బ్రిడ్జి ఎక్కితే వైబ్రేషన్స్ ఏర్పడడంతో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. నాసిరకం పనుల కారణంగా ఏడాది కూడా పూర్తికాకముందే బ్రిడ్జి రిపేర్ కు వచ్చిందని మండిపడుతున్నారు. నిజాంసాగర్ మంజీరా నదిపై నిజాంసాగర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి పరిస్థితి దారుణంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని జనం, వాహనదారులు భయపడుతున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో 2016లో నాటి బీఆర్ఎస్ సర్కారు ఓ హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. పనులు కూడా మొదలయ్యాయి. అప్పటి నుంచి సాగి సాగి 2023 నాటికి పూర్తయ్యాయి. దాదాపు రూ.25 కోట్ల ప్రజాధనం ఈ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం వెచ్చించింది. 2023 మార్చి 15న అప్పటి మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే, ప్రారంభించి ఏడాది గడిచిందో లేదో బ్రిడ్జి బీటలు వారడం మొదలుపెట్టింది. వంతెనకు ఇరువైపులా రోడ్డు కుంగిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వంతెనకు పగుళ్లు ఏర్పడడంతో జనం పలుమార్లు ఫిర్యాదు చేయగా.. అధికారులు సదరు కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ తాత్కాలికంగా మరమ్మతులు చేసి మమ అనిపించాడు. ఈ బ్రిడ్జి పై నుంచి వెళుతుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయని, కూలిపోతుందేమోనని భయం కలుగుతోందని వాహనదారులు వాపోతున్నారు.
Admin
Studio18 News