Studio18 News - తెలంగాణ / : Gossip Garage : కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్ట్‌లో నెక్ట్స్ ఎవరు? 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పిన సీఎం రేవంత్‌రెడ్డి… పదకొండో ఎమ్మెల్యేను రెడీ చేశారా? డిప్యూటీ సీఎం భట్టిని పొగడ్తలతో ముంచెత్తిన కారు పార్టీ ఎమ్మెల్యే… తన దారి గాంధీభవన్ వైపనే సంకేతాలు పంపారా? సొంత పార్టీ నేతల కంటే కూడా ఎక్కువగా డిప్యూటీ సీఎం భట్టిని ఆకాశానికెత్తేయడం వెనుక రీజనేంటి? ఆ ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఎవరా ఎమ్మెల్యే..? కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యేల్లో నెక్ట్స్ అనిల్ జాదవ్ ఉన్నారనే ప్రచారం.. కారు దిగేస్తున్న ఎమ్మెల్యేల సరసన చేరేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తహతహ లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బోథ్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన అనిల్ జాదవ్…. అధికార పార్టీ నేతలతో పోటీపడుతూ… ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని.. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా… తాజా ఎపిసోడ్‌తో ఆ ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తోందంటున్నారు పరిశీలకులు. రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యేల్లో నెక్ట్స్ అనిల్ జాదవ్ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరు.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క… గత బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పరిధిలోని పిప్రి గామంలో పర్యటించారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం అంటే గతేడాది మార్చి 16న ఇదే గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు భట్టి. సీఎల్పీ నేత హోదాలో నాడు పాదయాత్ర చేసిన భట్టి…. తమ పార్టీ అధికారంలోకి వస్తే పిప్రి గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను అమలు చేయడంలో భాగంగా గత బుధవారం పిప్రిలో పర్యటించారు భట్టి. ఐతే ఈ సభలో కాంగ్రెస్ నేతలతో పోటీపడుతూ మరీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్…. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే ఇప్పుడు అనేక ఊహాగానాలకు తెరలేపింది. డిప్యూటీ సీఎం సభకు భారీ అనుచరగణంతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి సభకు ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. వీరిలో ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే ఉండగా, మిగిలిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందిన వారు. ఐతే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెలిపాడ్ వద్దే భట్టిని కలిసి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అసలు అటువైపే చూడలేదు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ ఇద్దరిలో అనిల్ జాదవ్ హాజరే చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం సభకు భారీ అనుచరగణంతో కలిసి వచ్చిన అనిల్ జాదవ్… డిప్యూటీ సీఎం ఆశీస్సులు ఉండాలనే స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయడమే పొటిలికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్‌కు తెరలేపింది. మన ప్రభుత్వం అంటూ హాట్ కామెంట్స్.. డిప్యూటీ సీఎం భట్టి సభలో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పీచ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. విపక్షానికి చెందిన ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం భట్టిని తెగ పొగిడేయడం వెనుక రీజనేంటి? అనేది తెలుసుకోలేక స్థానిక బీఆర్ఎస్ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా అనిల్ జాదవ్ పొగడ్తలున్నాయంటున్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని కాసేపు మరచిపోయిన అనిల్ జాదవ్… తనలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని సంకేతాలిచ్చారా? అనే చర్చ జరుగుతోంది. ఒకనానొక దశలో మన ప్రభుత్వం అంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీతో, ఆ పార్టీ నేతలతో విడదీయరాని అనుబంధం.. వాస్తవానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్ జాదవ్ పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం 2019లో మళ్లీ టీ.ఆర్.ఎస్ గూటికి చేరి నేరడిగొండ జడ్పీటీసీగా విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనిల్ జాదవ్. నెక్ట్స్ లిస్ట్ లో ఉన్నది అనిల్? అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పరిణామాలు మారిపోతుండటంతో ఒక్కొక్కరుగా బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆసిఫాబాద్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అనిల్ జాదవ్ వ్యవహారశైలిని చూస్తే నెక్ట్స్ లిస్టులో ఉన్నది ఆయనే అన్న ప్రచారానికి బలం చేకూరుతోందంటున్నారు.
Admin
Studio18 News