Studio18 News - తెలంగాణ / : Hydra Commissioner AV Ranganath: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్ప్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. చెరువులను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయనకు ముప్పు పొంచివుందని భావించి ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది. హైదరాబాద్ మధురానగర్ కాలనీలోని రంగనాథ్ ఇంటివద్ద భద్రత పెంచడంతో పాటు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు భాగ్యనగరంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా చెరువులను చెరబట్టి వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారింది. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ తో పాటు ఇతర ప్రముఖులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. తాజాగా ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలపైనా హైడ్రా కన్నేసింది. చెరువులను కబ్జా చేసినవారిపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుతో పనిచేస్తోంది. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా పట్టించుకోకుండా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముందుకెళుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ముంపు పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రభుత్వం భద్రత పటిష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి హైడ్రా అందజేసిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో మొత్తం 166 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. కాగా, హైడ్రా చర్యలను నగరవాసులు, పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు చేపడుతున్నారు.
Admin
Studio18 News