Studio18 News - తెలంగాణ / : ఒక ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పల్లా జనగామలో ఆందోళన చేస్తున్న న్యాయవాదుల దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. న్యాయవాద దంపతులపై పోలీసుల దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... న్యాయవాదులపై దాడికి పాల్పడిన పోలీసులను బదిలీ చేయడంతో సరిపెట్టవద్దని... ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. దొంగలను, దోపిడీదారులను పట్టుకోమని పోలీసులను పెడితే, పోలీసులే దొంగలుగా మారి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సమస్యలపై తాను శాసనసభలో ప్రస్తావిస్తానన్నారు. కాగా, జనగామలో న్యాయవాద దంపతులపై దాడి ఘటన పట్ల పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ఇన్స్‌పెక్టర్, ఎస్సైలను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. ఇది చదవండి: న్యాయవాదుల ఆందోళనతో స్పందించిన ఉన్నతాధికారులు .. పోలీసులపై చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
Admin
Studio18 News