Studio18 News - తెలంగాణ / : కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన ఆదివాసి మహిళను బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివాసి మహిళపై షేక్ మగ్దూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు బాధితురాలిని, ఆమె కొడుకును బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోజు ఏం జరిగిందో ఆమె తనయుడు వివరించాడు. తన తల్లి రాఖీ కట్టేందుకు ఆటోలో వెళుతుంటే అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి నిందితుడు దాడి చేసినట్లు చెప్పాడు. తన తల్లి ప్రతిఘటించిందని, దీంతో గాయాలు అయినట్లు చెప్పాడు. జైనూర్ ఘటన అత్యంత దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1,900 అత్యాచార కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వం నుంచి స్పందన కరవైందన్నారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు మతకలహాలు జరిగేవని, కానీ కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు కనిపించాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందన్నారు. దేశంలోనే క్రైమ్ రేట్ మన వద్దే తక్కువ అని ఎన్నో సంస్థలు వెల్లడించాయని, కానీ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుపాకులు రాజ్యమేలుతున్నాయన్నారు. కొత్త డీజీపీ వచ్చాక రాష్ట్రంలో మతకల్లోహాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పుడు డయల్ 100 కూడా పని చేయడం లేదన్నారు. జైనూర్ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళపై అత్యాచారయత్నం జరిగితే పరామర్శించడానికి సీఎంకు సమయం చిక్కడం లేదా? అని ప్రశ్నించారు. ఆమెకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైనూర్ బాధితురాలి ఒళ్ళంతా గాయాలు కనిపిస్తున్నాయని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపించారు. గత ఎనిమిది నెలల్లో మహిళలపై అరాచకాలు పెరిగాయని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అసలు హైదరాబాద్ నగరంలోనే మహిళలకు భద్రత, భరోసా లేవన్నారు. బయటకు వెళ్లిన మహిళలు, అమ్మాయిలు ఇంటికి ఎలా వస్తారనే భయం కుటుంబ సభ్యుల్లో నెలకొందన్నారు.
Admin
Studio18 News