Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సలకం చెరువులో అక్బరుద్దీన్ ఒవైసీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న పోస్టులపై అక్బరుద్దీన్ స్పందిస్తూ.. ట్యాంక్ బండ్ బఫర్ జోన్‌లో ఉన్న నెక్లెస్ రోడ్‌ని కూడా కూల్చి వేస్తారా అని నిలదీశారు. తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించుకోవచ్చని, ఆ స్కూల్‌ని మాత్రం కూల్చవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని చెప్పుకొచ్చారు. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, ఇప్పుడు కూడా కావాలంటే మళ్లీ అలా దాడి చేసుకోవచ్చని అన్నారు. కత్తులతో కూడా దాడి చేసుకోవచ్చని, కానీ పేదల విద్యాభివృద్ధి చేస్తున్న కృషికి మాత్రం అడ్డుపడొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కాగా, హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News