Studio18 News - తెలంగాణ / : Heavy Rains in Telangana : తెలంగాణలోని పలు జల్లాల్లో కొద్దిరోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాంగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ లోనూ ప్రతీరోజూ వర్షం కురుస్తోంది. సోమవారం తెల్లవారు జామున నగరంలోని పలు ఏరియాల్లో వర్షం పడింది. అయితే, మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటకను ఆనుకొనిఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. అదేవిధంగా సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Admin
Studio18 News