Studio18 News - తెలంగాణ / : Telangana Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. గత పదేండ్లు బీఆర్ఎస్ పాలన ఓ సినిమాలో కోటా శ్రీనివాస్ రావు కోడి కూర కథలాగే ఉందంటూ విమర్శించారు. లక్షలాది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు.. బీఆర్ఎస్ పదేండ్లలో ఎవరికి ఇండ్లు ఇచ్చారని సీతక్క ప్రశ్నించారు. బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్తుంటే ప్రజలు నిజమని నమ్మారు. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. మేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ప్రకటించారు. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా. మా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బాధ కలుగుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతిమాట కచ్చితంగా నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క చెప్పారు. అబద్ధాలు అద్భుతంగా చెప్పడం లో కేటీఆర్ దిట్ట. పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్ళలేదు. డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మమ్మ నుంచి రికవారీ చేశారని మా దృష్టికి రాలేదు. మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం ధరణి లో పేరు లేదని రైతు బంధు రాకుండా చేశారు. ప్రతిరోజూ ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అంటే.. బయట ఉన్న మేము నిజమే అనుకున్నాం. మా మానిఫెస్టో చూసి.. మేము గ్యాస్ సిలెండర్ రూ.500 అంటే.. మీరు నాలుగు వందలే అన్నారు. ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఐదేళ్లు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. తప్పకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు.
Admin
Studio18 News