Studio18 News - తెలంగాణ / : మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు... కూలినప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేడిగడ్డ పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగాయన్నారు. నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలా జరిగిందని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ఇప్పుడు ఆ నివేదికపై కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అక్టోబర్ 21న బ్యారేజీ కుంగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్‌లో అని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద ఎవరో బాంబులు పెట్టారని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, బ్యారేజీ కుంగినా కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. ఎన్డీఎస్ సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ గేట్లు తెరుస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని బీఆర్ఎస్ భారీగా పెంచిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే అన్నారు. ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తిస్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తై అన్ని మోటార్లు రన్ చేస్తే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశముందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నారన్నారు. ఏడాదికి ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోందన్నారు. దాదాపు రూ.94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద కేవలం 93 వేల ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News