Studio18 News - తెలంగాణ / : Scorpion Festival : దేశంలోని చాలా ప్రాంతాల్లో నాగుల పంచమి జరుపుకుంటుండగా.. తెలంగాణ – కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఓ గ్రామంలో మాత్రం తేళ్ల పంచమి జరుపుకుంటారు. సాధారణంగా మన ఇళ్లలో తేలును చూస్తేనే భయపడిపోతాం. కానీ, తేళ్ల పంచమి రోజు ఆ గ్రామంలోని చిన్నారులు, పెద్దలు వాటిని పట్టుకొని, ఒంటిపై వేసుకొని ఆడుకుంటారు. యువకులు తేళ్లతో పలురకాల విన్యాసాలు చేస్తారు. అయినా ఆ తేళ్లు కుట్టవు. తేళ్ల దేవతల కోసం ప్రత్యేకంగా ఆలయం కూడా నిర్మించడంతో ఆలయంలో తేళ్ల దేవతలకు పూజలు నిర్వహిస్తారు. ప్రతీయేటా నాగుల పంచమి రోజున ఆ గ్రామస్తులు తేళ్ల పండుగను నిర్వహిస్తారు. ఈ వింత పండుగను తెలంగాణ – కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామంలో నిర్వహిస్తారు. తేళ్లకు పూజలు చేస్తారు. ఏండ్లుగా ఆ గ్రామంలో ఇదే ఆచారం కొనసాగుతూ వస్తుంది. నాగ పంచమి రోజు దేశంలో చాలా చోట్ల పాముకు పాలు పోసి పూజలు చేయడం తెలిసిందే. కానీ, కందుకూరు గ్రామ ప్రజలు మాత్రం తేళ్లకు పూజలు చేస్తారు. చిన్నాపెద్దా తేడాలేకుండా వాటిని ఒంటిపై వేసుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన తేళ్ల దేవత ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట పట్టణానికి 25 కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందూకూరు గ్రామ శివారులో ఉంది. పెద్దగుట్టపై ఈ ఆలయం ఉంటుంది. భక్తులు గుట్టపై రాళ్ల కింద ఉన్న తేళ్లను చేతితో పట్టుకొని ఒంటిపై, ముఖంపై, నాలుకపై వేసుకొని విన్యాసాలు చేస్తారు. ఈ వింతను ప్రత్యక్షంగా చూడటానికి తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తారు. కొత్త దంపతులు, శుభకార్యాలకు వెళ్లేవారు తేళ్ల దేవతను దర్శించుకోవడం కందకూరు గ్రామ ప్రజల ఆనవాయితీ. గుట్టపై ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయి. తేళ్ల పంచమి రోజు వాటిని ముట్టుకున్నా, శరీరంపై వేసుకున్నా అవి కుట్టవట. ఈ పండుగ రోజు తేళ్లను ముట్టుకొని, ఆలయంలో పూజలు చేస్తే ఏడాదిపాటు ఆలయంలోకి విషపరుగులు రావని గ్రామస్తుల నమ్మకం. అయితే, ఈ ఆచారం ఏళ్ల తరబడి నుంచి వస్తుంది. తేళ్ల పంచమి రోజు ఇక్కడి తేళ్లు ఎందుకు కుట్టకుండా ఉండటానికి ఓ కథకూడా ఉంది. అదేమిటంటే.. కందూకురు గ్రామం పక్కనే ఓ గుట్ట ఉంది. దాన్ని కొండమావుల గుట్టగా పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ గుట్టపై ఓ వ్యక్తి తవ్వకాలు జరుపుతుండగా పెద్ద తేలు బయటపడింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. నన్ను కుట్టకుండా ఉంటే నీకు గుడి కడతా అని తేలును చూసి మొక్కకున్నాడు. వెంటనే ఆ తేలు అదృశ్యమైంది. ఆ తరువాత అతను చిన్న గుడి కట్టి మొక్కు తీర్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రతీయేటా తేళ్ల పంచమి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ తరువాత గ్రామస్తులు అక్కడే కొండ మహేశ్వరి మాతగా పిలిచే తేలు విగ్రహాన్ని ప్రతిష్టించి పెద్ద ఆలయాన్ని నిర్మించారు. తేళ్ల పంచమి రోజు చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు ఇక్కడ అందరూ భయంలేకుండా తేళ్లను పట్టుకుంటారు. అక్కడ గుట్టపై ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయి. ముఖంపై, శరీరంపై వేసుకున్నా తేళ్లు కుట్టవు. ఈ తేళ్ల పంచమి ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచిసైతం భక్తులు వస్తుంటారు.
Admin
Studio18 News